1981 సెప్టెంబర్ 3న “కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్”(సీడా) అంతర్జాతీయ ఒప్పందంగా అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1979 డిసెంబర్ 18న దీనిని ఆమోదించింది. 130 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేక ఓటు ఒక్కటీ లేదు.
సీడాను ప్రపంచవ్యాప్తంగా “మహిళల హక్కుల అంతర్జాతీయ బిల్లు”గా అభివర్ణిస్తారు. ఇందులో 30 ఆర్టికల్స్ ఉన్నాయి. మహిళలపై వివక్ష అంటే ఏమిటో నిర్వచించడంతో పాటు, దానిని తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
20వ శతాబ్దంలో అనేక దేశాల్లో మహిళలకు ఓటు హక్కు, విద్య, ఉద్యోగం, ఆస్తి హక్కు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి హక్కులు క్రమంగా లభించాయి.
అయితే ఒక పెద్ద సమస్య మిగిలిపోయింది. చట్టంలో హక్కులు ఉండటం అభివృద్ధి క్రమంలో ఒక మెట్టు. మహిళలు ఆ హక్కులను వాస్తవ జీవితంలో అనుభవించగలిగే వాతావరణం సృష్టించటం మరొక ప్రధానమైన మెట్టు.
కుటుంబంలో వివక్ష, సమాన పనికి అసమాన వేతనం, బాల్య వివాహాలు, మహిళలపై హింస, విద్యకు పరిమిత అవకాశాలు, ఆస్తి హక్కుల్లో అసమానత, రాజకీయ నిర్ణయాల్లో తక్కువ ప్రాతినిధ్యం, ఇంటి పనికి విలువ లేకపోవడం వంటి సమస్యలు నేటికి ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సీడా ఒక కీలకమైన సమస్య పరిష్కారాలను ముందుకు తెచ్చింది. అందులో మహిళలపై వివక్షను కేవలం ఖండించడంతో సరిపోదు. దానిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు చట్టపరమైన, సామాజిక, ఆర్థిక, ఇతరత్రా చర్యలు తీసుకోవాలి. సీడాను ఆమోదించిన దేశాలు మహిళలపై వివక్షను ఎదుర్కోవడానికి చట్టాలు, విధానాలు, సంస్థాగత చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలి.
సీడా ప్రధానంగా ఏ హక్కులను కోరుతోంది?
సీడా మహిళల జీవితంలోని దాదాపు అన్ని పార్శ్వాలను వివరించింది.
విద్యలో సమానత్వం: అబ్బాయిలతో సమానంగా బాలికలకు విద్యావకాశాలు ఉండాలి.
ఉద్యోగంలో సమానత్వం: మహిళలకు ఉద్యోగం పొందే హక్కు, వృత్తిని ఎంచుకునే హక్కు, శిక్షణ పొందే హక్కు, సమాన వేతనం పొందే హక్కు ప్రభుత్వాలు కల్పించాలి.
రాజకీయ హక్కులు: ఓటు వేయడం మాత్రమే కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం, విధాన నిర్ణయాల్లో పాల్గొనడం కూడా మహిళల హక్కులే.
ఆరోగ్య హక్కు: మహిళలకు సముచిత ఆరోగ్య సేవలు, ప్రసూతి సంరక్షణ, కుటుంబ నియంత్రణ వంటి సేవలు అందుబాటులో ఉండాలి.
వివాహం, కుటుంబంలో సమానత్వం: వివాహం చేసుకోవాలా వద్దా, ఎవరిని వివాహం చేసుకోవాలి, పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలి.
చట్టం ముందు సమానత్వం: మహిళకు పురుషుడితో సమానమైన, న్యాయపరమైన హోదా ఉండాలి.
45 సంవత్సరాల తరువాత ప్రపంచ పరిస్థితి?..
సీడా అమల్లోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. కొన్ని రంగాల్లో పురోగతి ఉంది. కానీ ప్రపంచం ఇంకా లింగ సమానత్వానికి చాలా దూరంలో ఉంది.
2025 ప్రారంభంలో ప్రపంచం మొత్తంలో పార్లమెంట్లో మహిళల సగటు ప్రాతినిధ్యం 27.2 శాతం మాత్రమే. 1995లో అది కేవలం 11.3 శాతం ఉండేది. కొంత పురోగతి ఉన్నప్పటికీ వేగం చాలా తక్కువగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా, మహిళలు పురుషుల కంటే 2.5 రెట్లు ఎక్కువ సమయం వేతనం లేని ఇంటి పనులు, పెద్దల, పిల్లల సంరక్షణ పనుల్లో గడుపుతున్నారు.
మహిళలు నిర్వహించే ఈ “అన్‌పెయిడ్ కేర్ వర్క్” ఆర్థిక వ్యవస్థకు అపారమైన విలువను సృష్టిస్తున్నప్పటికీ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) లెక్కల్లోకి మాత్రం దీనిని పరిగణనలోకి తీసుకోరు.
ప్రపంచవ్యాప్తంగా 708 మిలియన్ల మహిళలు సంరక్షణ బాధ్యతల కారణంగా ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని యూఎన్ ఉమెన్ పేర్కొంటోంది. అంటే ప్రశ్న కేవలం “మహిళలకు హక్కులు ఉన్నాయా?” అనేది కాదు. అసలు సమస్య “ఆ హక్కులను ఉపయోగించుకునే సామాజిక, ఆర్థిక, సాంఘిక వాతావరణం మహిళలకు ఉన్నదా?” అనేదే అసలు సమస్య.
సామ్యవాద (సోషలిస్ట్) దేశాల అనుభవం..
ఇక్కడ ఒక ముఖ్యమైన చారిత్రక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. మహిళా విముక్తి ప్రశ్నను కేవలం “చట్టపరమైన సమానత్వం”గా కాకుండా, ఆర్థిక స్వావలంబన, విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ప్రసూతి రక్షణ, ప్రజా సేవలు వంటి అంశాలతో కలసి అమలు జరిగే వాతావరణం సృష్టించిన దేశాలలో సామ్యవాద దేశాలకు ప్రత్యేక చారిత్రక స్థానం ఉంది.
సోవియట్ యూనియన్ ప్రారంభ దశలోనే మహిళల చట్టపరమైన సమానత్వం, మహిళల ఉపాధి, ప్రసూతి రక్షణ, విద్య వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం సోవియట్ యూనియన్. తరువాత చైనా, క్యూబా, వియత్నాం వంటి సామ్యవాద దేశాలు కూడా మహిళలను ఉత్పత్తి, విద్య, రాజకీయాల్లోకి విస్తృతంగా తీసుకురావడానికి దేశవ్యాపిత విధానాలను అమలు చేశాయి.
అయితే ఆ దేశాలలో కూడా అమలకు రావలసిన అంశాలు కూడా ఉన్నాయి. తేడా ఏమిటంటే మహిళా సమస్యను వ్యక్తిగత కుటుంబ సమస్యగా మాత్రమే కాకుండా, సామాజిక-ఆర్థిక సమస్యగా సోషలిస్టు దేశాలు తమ బాధ్యతగా స్వీకరించాయి.
క్యూబా ఉదాహరణ..
ప్రస్తుత ప్రపంచంలో క్యూబా ఒక అద్భుతమైన ఉదాహరణ. 2025 డిసెంబర్ నాటి ఇంటర్‌పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) గణాంకాల ప్రకారం క్యూబా జాతీయ అసెంబ్లీలోని 467 మంది సభ్యుల్లో 267 మంది మహిళలు. అంటే 57.2 శాతం. పురుషుల కంటే మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ. ఇది ప్రపంచ సగటు 27.2 శాతంతో పోలిస్తే రెట్టింపుకు పైగా ఉంది.
వియత్నాం ఉదాహరణ..
2026 మార్చి నాటి ఐపీయూ సమాచారం ప్రకారం వియత్నాం జాతీయ అసెంబ్లీలో 500 మంది సభ్యుల్లో 150 మంది మహిళలు. అంటే 30 శాతం ఉన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం వియత్నాం మొత్తం లింగ వివక్షతను 71.3 శాతం రూపుమాపింది. ఆర్థిక భాగస్వామ్యంలో 75.9 శాతం, విద్యలో 97.2 శాతం స్థాయి సాధించింది. అంటే మహిళలను కేవలం “సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా” కాకుండా విద్య, ఉపాధి, రాజకీయాలు, ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయడం అక్కడి అభివృద్ధి నమూనాలో ఒక భాగంగా ఉంది.
చైనా అనుభవం..
చైనాలో మహిళలు విద్య, ఉద్యోగాలు, పరిశ్రమ, విజ్ఞానం వంటి రంగాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం చైనా విద్యా రంగంలో జెండర్ పారిటీ(లింగ సమానత్వం) సాధించింది. అనేక విద్యా స్థాయిల్లో మహిళల ఎన్రోల్మెంట్ పురుషుల కంటే ఎక్కువగా ఉంది. అయితే ఆర్థిక, రాజకీయ సమానత్వంలో ఇంకా అంతరం ఉంది.
ఐపీయూ గణాంకాల ప్రకారం చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం 26.5 శాతం. చైనా అనుభవం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నది. విద్యలో సమానత్వం సాధించడం సులభమైన మొదటి అడుగు. ఆర్థిక నిర్ణయాధికారం, అత్యున్నత రాజకీయ నాయకత్వం, వేతన సమానత్వం వంటి తదుపరి దశలు మరింత కఠినమైనవి.
పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి..
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పెట్టుబడిదారీ దేశాలన్నీ మహిళలకు వ్యతిరేకం అని చెప్పడం సరి కాదు. ఉదాహరణకు కొన్ని నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో మహిళల విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రసూతి లేదా పితృత్వ సెలవులు, సామాజిక భద్రత, ప్రజా సేవలలో అత్యున్నత ప్రమాణాలను సాధించాయి.
ఈ దేశాలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ, బలమైన సంక్షేమ రాజ్యం, ప్రభుత్వ ఆరోగ్యం, విద్య, చైల్డ్ కేర్, పేరెంటల్ లీవ్, ట్రేడ్ యూనియన్ ప్రొటెక్షన్ వంటి సామాజిక విధానాలను అమలు చేశాయి.
పై అనుభవాలు పరిశీలించినప్పుడు మహిళా సమానత్వానికి ఆర్థిక వ్యవస్థ పేరు ఒక్కటే నిర్ణయాత్మకం కాదు. ప్రభుత్వ విధానాలు, సామాజిక భద్రత, కార్మిక హక్కులు, ప్రభుత్వ సేవలు, మహిళల రాజకీయ శక్తి కూడా కీలకం.
అత్యంత వెనుకబడిన పరిస్థితులు..
ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకే స్థాయిలో లేవు. ఆఫ్ఘనిస్తాన్ అత్యంత బాధాకరమైన ఉదాహరణ. యూఎన్ ఉమెన్ ప్రకారం 2021 తరువాత అక్కడ మహిళలు, బాలికల విద్య, ఉద్యోగం, రాజకీయ భాగస్వామ్యం, స్వేచ్ఛగా సంచరించడం వంటి అనేక హక్కులపై తీవ్రమైన ఆంక్షలు విధించబడ్డాయి.
2024 జెండర్ ఇండెక్స్ ప్రకారం దాదాపు పది మందిలో ఎనిమిది మంది యువ ఆఫ్ఘన్ మహిళలు విద్య, ఉపాధి లేదా శిక్షణకు దూరంగా ఉన్నారు.
2026లో కూడా మహిళల విద్య, ఉపాధి, సంచారం, వ్యక్తీకరణ, ప్రజా జీవితంపై ఆంక్షలు కొనసాగుతున్నాయని యూఎన్ ఉమెన్ పేర్కొంది. ఇది సీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి.
భారతదేశం స్థానం ఎక్కడ?..
భారతదేశం రాజ్యాంగ పరంగా మహిళలకు పురుషులతో సమాన హక్కులను కల్పించింది. ఓటు హక్కు విషయంలో కూడా భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన హక్కును ఇచ్చింది.
అయితే ఆచరణలో ఇంకా అనేక కీలకమైన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత ఐపీయూ గణాంకాల ప్రకారం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 13.84 శాతం మాత్రమే.
రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం సుమారు 15.7 శాతంగా ఉంది. అంటే ప్రపంచ పార్లమెంటరీ సగటు 27.2 శాతంతో పోలిస్తే భారతదేశం ఇంకా చాలా వెనుకబడి ఉంది.
భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు..
సంఘటిత రంగ ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం అతి తక్కువ. అసంఘటిత రంగం, స్వయం ఉపాధిలో అధిక భాగం ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఇంటి పనికి ఆర్థిక విలువ లేదు.
మహిళలపై హింస, బాల్య వివాహాలు, విద్య, ఆరోగ్యం అంశాలు మహిళలకు చాలా లోపంగా ఉన్నాయి. రాజకీయ నిర్ణయాల్లో పరిమిత ప్రాతినిధ్యం.
రిజర్వేషన్ కారణంగా మహిళలు వివిధ స్థాయిలలో పదవులకు ఎన్నిక అయినప్పటికీ, ఆచరణలో పురుషులే పెత్తనం చలాయిస్తున్నారు. పిల్లల, వృద్ధుల బాధ్యత ప్రధానంగా మహిళలపైనే ఉంది.
మహిళల “ఉచిత శ్రమ” గుర్తించని ఆర్థిక వ్యవస్థ..
ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఒక మహిళ ఉదయం లేచి వంట చేస్తుంది, పిల్లలను, వృద్ధులను చూసుకుంటుంది. ఇల్లు శుభ్రం చేస్తుంది, నీళ్లు తెస్తుంది, బట్టలు ఉతుకుతుంది, కుటుంబ సభ్యులను ఉద్యోగాలకు, పిల్లలను చదువులకు సిద్ధం చేస్తుంది.
ఇవేవీ జీడీపీలో ఆమె చేసిన “ఉత్పత్తి”గా లెక్కలోకి తీసుకోరు. కానీ ఆమె ఒక్కరోజు ఈ పనులన్నీ ఆపేస్తే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, మొత్తం సమాజం ఆగిపోతుంది.
యూఎన్ ఉమెన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే 2.5 రెట్లు ఎక్కువ వేతనం లేని పని(అన్‌పెయిడ్ కేర్ వర్క్) చేస్తున్నారు.
అందువల్ల మహిళా విముక్తి అంటే కేవలం “మహిళలకు ఉద్యోగం ఇవ్వాలి” అనడం కాదు. “ఇంటి పనిని ఎవరు చేస్తారు?” అనేదీ అంతే ముఖ్యమైనది.
సీడా నుంచి నేర్చుకోవలసింది, అమలు చేయాల్సినది ఏమిటి?
నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఒక విషయం స్పష్టం చేస్తోంది. మొదటి దశ చట్టపరమైన సమానత్వం. ఆ తర్వాత విద్యలో సమానత్వం. మూడవ దశలో ఉపాధి, సమాన వేతనం.
నాలుగవ దశలో ఆర్థిక స్వాతంత్ర్యం, ఐదవ దశలో రాజకీయ అధికారంలో సమాన భాగస్వామ్యం కల్పించాలి. ఆరవ దశలో కుటుంబంలో సమాన బాధ్యత, ఏడవ దశలో హింస, వివక్ష, దోపిడీ నుంచి విముక్తి అన్నీ కలిసినప్పుడే నిజమైన మహిళా సమానత్వం సాధ్యమవుతుంది.
మహిళల చట్టపరమైన సమానత్వం మొదటి నుంచి దేశాన్ని బట్టి భిన్నంగా ఉంది. ఇది మారాలి. మహిళల ఉపాధి మార్కెట్ అవసరాలపై ఆధారపడి ఉంది. దానికి బదులుగా మహిళలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. అందరికీ విద్య అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో ఆడపిల్లల నిర్బంధ విద్య ప్రభుత్వ విధానంగా ఉండాలి.
ఆరోగ్యం, ప్రజా సేవలు, ప్రసూతి రక్షణ తదితర సమస్యలు పరిష్కారానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రధానంగా బాధ్యత తీసుకోవాలి.
రాజకీయ ప్రాతినిధ్యం కొన్ని దేశాల్లో చాలా ఎక్కువ, కొన్ని దేశాల్లో అధికం, మరి కొన్నింటిలో అతి తక్కువగా ఉంది. దీన్ని అధిగమించి మహిళల ప్రాతినిధ్యం అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులలో గణనీయంగా పెంచడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి.
మహిళల శ్రమను లెక్కించని ఇంటి పనుల విషయంలో ఇప్పటికీ అనేక దేశాలలో పెద్ద మార్పు రావలసి ఉంది. మహిళా విముక్తి అనేది సామాజిక, ఆర్థిక, సాంఘిక మార్పుతో అనుసంధానం చేయాలి.
కేవలం నినాదాలకు పరిమితం కాకుండా, విద్య, ఉపాధి, వేతనం, ఆరోగ్యం, సామాజిక భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, కుటుంబ బాధ్యత అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందుకు తగిన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించాలి.
మహిళా సమానత్వం అంటే పురుషులకు వ్యతిరేక పోరాటం కాదు..
మహిళా విముక్తి అంటే పురుషుల హక్కులను తగ్గించడం లేదా హరించడం కాదు. సమాజంలోని సగం జనాభాకు సమానమైన మానవ గౌరవం, అవకాశాలు, నిర్ణయాధికారం కల్పించే పోరాటం.
లెక్కించబడని మహిళల శ్రమలో(అన్‌పెయిడ్ కేర్ వర్క్) పురుషులు కూడా కుటుంబ బాధ్యతలను సమానంగా పంచుకునే పరిస్థితులు సృష్టించాలి.
మహిళలకు సమాన వేతనం వస్తే కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మహిళలకు విద్య వస్తే పిల్లల ఆరోగ్యం, విద్య మెరుగుపడతాయి. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితే ప్రజాస్వామ్యం మరింత విస్తృతమవుతుంది.
ముందున్న ప్రధాన సవాళ్లు: హక్కుల నుంచి అధికారానికి. సీడా 45 సంవత్సరాల ప్రయాణాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే “మహిళలకు హక్కులు ఇవ్వడం” నుంచి “మహిళలు ఆ హక్కులను ఉపయోగించుకునే సామాజిక, ఆర్థిక శక్తిని నిర్మించడం” వైపు ప్రయాణం చేయాలి.
కాగితంపై సమానత్వం ఉన్నా, మహిళకు ఉద్యోగం లేకపోతే ఆమె ఆర్థికంగా భర్త లేదా తన కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగం ఉన్నా చైల్డ్ కేర్ లేకపోతే ఆమె కెరీర్‌కు నష్టం కలుగుతుంది.
ఉద్యోగం ఉన్నా సమాన వేతనం లేకపోతే వివక్ష కొనసాగుతుంది. విద్య ఉన్నా రాజకీయ అధికారంలో స్థానం లేకపోతే నిర్ణయాధికారం నామమాత్రంగానే ఉంటుంది. అందుకే మహిళా సమానత్వం కేవలం చట్టంతో సాధ్యం కాదు.
మహిళలకు సమాన హక్కులు అంటే నాణ్యమైన ఉచిత విద్య, ప్రజా ఆరోగ్యం, చైల్డ్ కేర్, ప్రసూతి రక్షణ, సమాన వేతనం, కార్మిక హక్కులు, సామాజిక భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, గృహ హింస నిర్మూలన, ఇంటి పనిలో సమాన భాగస్వామ్యం జరగాలి.
సెప్టెంబర్ 3, 1981 ఒక అంతర్జాతీయ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ మాత్రమే కాదు. అది ప్రపంచానికి ఒక ప్రశ్న వేసిన రోజు. “ప్రపంచ జనాభాలో సగం మంది అయిన మహిళలు నిజంగా సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన అధికారాన్ని అనుభవిస్తున్నారా?” అంటే 45 సంవత్సరాల అనుభవంలో కొంత పురోగతి సాధించాం. కానీ లక్ష్యం ఇంకా సుదూరంలోనే ఉంది.
క్యూబా వంటి దేశాల్లో మహిళల పార్లమెంటరీ ప్రాతినిధ్యం 57 శాతం దాటింది. వియత్నాంలో 30 శాతం ఉంది. చైనాలో 26.5 శాతం ఉంది.
అదే సమయంలో భారత లోక్‌సభలో అది 13.84 శాతం మాత్రమే. ప్రపంచంలోని ఏ దేశమూ “మహిళా విముక్తి పూర్తయింది” అని చెప్పుకునే స్థితిలో లేదు.
మహిళా సమానత్వం అంటే కేవలం చట్టంలో సమానత్వం కాదు. జీవితంలోని ప్రతి రంగంలో సమానత్వం. అది సాధించడానికి రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం, నాణ్యమైన ప్రజా సేవలు, సామాజిక భద్రత, సమాన వేతనం, బలమైన కార్మిక హక్కులు, అన్‌పెయిడ్ కేర్ వర్క్ సామాజీకరణ, నిర్ణయాధికారంలో మహిళల సమాన భాగస్వామ్యం అవసరం. అదే సీడా అసలు స్ఫూర్తి.
“మహిళలకు సమాన హక్కులు” అనే మాటను “మహిళలకు సమాన జీవితం”గా మార్చడమే మన ముందున్న చారిత్రక కర్తవ్యం. అందుకు మహిళలతో పాటు పురుషులు ప్రధానంగా అన్ని స్థాయిలలో బాధ్యత తీసుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
